27, మార్చి 2022, ఆదివారం

స్వార్థం

———

అహం మోహానికి ఒరిగి

సమూహం సత్తాకు మరిగి

వికృత విబేధాల పెరిగి

ప్రతి మెదడు మలినాన

మొలిచినిలిచి గెలిచి

సమాజానికిజనానికి మత్తై

నీదినాది,

మాదిమీది

ఆలోచనల అవధై

ప్రేమదయ

జాలికరుణ

పదాల సమాధై 

సత్యమేవజయతేకి

స్వార్థమేవజయతే 

పర్యాయపదమై

నిజంనిజాయితీలను

నగ్నంగా నిలబెట్టి

జాతీయాల చదువుకోమని

వెకిలిగా వెక్కిరిస్తూ 

మనిషి మనసును 

ఉనికినిహేళన చేసే

అంతరంగ అశుద్ధం

తెలుగు పూదోట

ఏపుగా పెరిగి..

క్షవరం అవసరమైన

తెలుగు అక్షరం స్వార్థం!

25, జూన్ 2020, గురువారం

RNA కిరీటి

కఠోర నిజమైన మనుషుల్లో స్వార్థమనే వ్యర్ధాన్ని
రోకలిబండలాటి కరోనా సత్యమనే రోట్లో వేసి దంచి
నాది, నేను అనే జీవిత అహంకారం వంకర తీసి
సమానత్వం, మానవత్వం అర్థాలను తిరిగి
పరిచయంచేసి కనువిప్పు కలుగజేసె ప్రపంచ జనానికి,
2020 సంవత్సరాన మకుటమక్కరలేని RNA కిరీటి ‘కరోనా’

24, జూన్ 2020, బుధవారం

World Cleaner’s day


అపరిశుభ్రమగు పరిసరాల శుభ్రంచేసి
మలినాలను కడిగి, నీ ఆరోగ్యం కాపాడే
పారిశుధ్యకార్మికులపై దయలేని దరిద్రుడా!
కొన్ని మంత్రాలను నీకర్థమవని భాషలోజెప్పి
నెత్తిన శఠగోపమెట్టి, నీ జేబుకు చిల్లుబెట్టి,
నువ్విచ్చే దక్షిణ తాకి, నినుముట్టితే మైలనుకునే
పూజారికి మొక్కు, మతిలేని నికృష్ట మానవా!
కరోనా, కఠోరంగా తెలిపిన జ్ఞానమిది తెలుసుకో
తెలివితో మెలిగి ‘పరిశుభ్రత’ ‘కరుణ’లకు తావిచ్చి
భయమనేభక్తికంటే, శాస్త్రీయఅవగాహనతో బతికిపో!!

On (15th June) World Cleaner’s day ని పురస్కరించుకొని.. పారిశుద్ధ్య కార్మికులకు వినమ్ర ప్రణామాలతో💐

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

పరువు హత్య

ముందుగా,ఈ కవితలో నాభాషను క్షమించి భావావేశ గాఢతను అర్ధం చేసుకొంటారని మనవి.

మనుషుల్లో మంచితనాన్ని, గొప్పతనాన్ని నాగరికతతో, మానసిక పరిపక్వతతో ఎంచుతామే కానీ వారి కులంతో, మతంతో కాదు అని నమ్మి ... కులాల కంపును, జరుగుతున్న పరువు హత్యలను చూసి భరించలేక వేదనతో రాసిన కవిత.

 పరువుహత్య మాట విని
హృదయం బరువైంది
అశృవులతో, ఆవేశంతో
నా కన్నెరుపెక్కింది 
అమృతం వర్షించే మనసు
ఆ ప్రణయ హత్యోదంతో 
నిండు గర్భిణి, సోదరి 
అమృతవర్షిణి ఆవేదనకు 
చలించి కత్తై, నా కలం కదిలిందిలా
కులదురహంకారంపై ... కసిగా,

కులం మలం తిని
అదే బలం అనుకొని
తెగ మొరిగే శునకాల్లారా!
మా కులమెక్కువని పెట్రేగే
అహంకార, కుసంస్కారుల్లారా
మనిషిగ బ్రతకలేని మృగాల్లారా!

ఇరువదితరాల వెనుకకు, 
తాత ముత్తాతలపేర్లే తెలియని, సంకరజాతి మనందరిదని
మలినమైన మీ బుర్రలకెరుకేనా?

నీతిమాలి, దౌర్జన్యాలతో
అక్రమాస్తుల, పైసల,
పెత్తందారీ పదవులనార్జించి 
పరువు పెంటకుప్పల పేర్చి  
అశుద్ధాన్ని అమృతంలా ఆరగిస్తూ,
ఆత్మీయత అనే అర్థాన్ని
కులాహంకారానికి ఆపాదిస్తూ 
ఆ అవలక్షణాన్ని అందరికీ అంటిస్తూ
మీ స్వార్ధం వ్యర్ధాలను పోగేస్తూ
మనుషుల మనసు, మానవత్వాన్ని
మీ కులజాడ్యాలతో విభజించి పోషిస్తూ

పరువు హత్యల పేరున,
నిండు ప్రాణాలనే బలికొంటూ
కులం కాలకూటవిషంతో, విషనాగులై,
పచ్చని సంసారాలను ఛిద్రం చేస్తూ..
కులం, మతం, దైవం ఆచారాల వంకతో
బావిలో కప్పలవలె, మనువునీతిదని,
ఆ అభిజాత్యాన్ని పెంచి పోషిస్తూ,
యువత భవితను కోతిని చేసి ఆడిస్తూ
చివరకు ఆ గోతిలోనే పడి ఛస్తూ
ఏం బావుకుంటావురా?  
జీవిత చరమాంకంలో?

 ఛీ .ఛీ... నీచ నికృష్ట కులగజ్జి రోగి!!
నీ జబ్బుకు మందెక్కడో లేదు
నీలోనే ఉందది, వెతుకు నిబద్దతతో,
మనిషిగా, మంచిగ బతకాలనుకొంటే
అతిత్వరగా అలోచించి నయంచేసుకో
లేకుంటే, అన్నివిధాలా అత్యధికంగా
మానసికంగా, కృశించి, నశించి,
ఈ విశ్వానికి పట్టిన చీడ పురుగై,
మరుగై పోతావ్..!  ఖబడ్దార్!!

అంతేకాదు,
ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో
కులం శబ్దమినివించిందో..?
రేపటి తరం, నీ శిశ్నము కోసి
కాకుల గద్దలకాహారంగా వేసి
నువొక మానసిక రోగివని,
నీ ఉద్రేకానికి, ముద్రేయ్యకముందే
ప్రపంచగతినర్ధంచేసుకుని మారిపో ?
లేకపోతే, నీకిక పుట్టగతులుండవ్
ఈ నవ యువ ప్రపంచీకరణాన !

(నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి, పరువు  హత్యకు గురైన "ప్రణయ్" కు శ్రద్ధాంజలితో )

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

తెలుగంటే?

తెలుగంటే??

తెలుగంటే, గుర్తింపుకై
మురిపెంగా నువు ధరించే
తెల్లచొక్క, ధోతీకాదురా!
ఆ ఉనికిని పెంచగ
భుజంపై వేలాడే
ఉత్తరీయం కాదురా!
తెలుగంటే భాషరా!
తెలుగంటే మాటరా!
తెలుగంటే  పాటరా!
భాషతొ మమేకమవ్వాలంటే
నీజీవన సంజీవనదవ్వాలంటే        

ఇంటా, బయట
అనుభూతితో, నువ్వు
పలికితేనే అది బతికేది
మాటాడితేనే మనేది

తెలుగు భాష ఎవరిది తెలుసా?
ఎన్నోభాషల నేర్చి, పాండిత్యం గడించి
గండపేరుండాలను పొందిన
ఉద్దండ పండితుడిది కాదు

ఈ భాషలో తప్ప
వేరే భాషానుభూతిని
పొందే అవకాశంలేని
పామరుడి తల్లిభాషరా!తెలుగు భాష!!

అపుడెమో సంస్కృతం
సంకనెట్టి మరీ సగం చంపారు,
ఆంగ్లానికిప్పుడేకంగ అమ్మేశారు.

కాస్తంత, ఇప్పుడైనా
చదవండి, రాయండి
గ్రాంధికమని, గ్రంథస్థమని
కట్టుబాట్ల, భాషను బంధించి
వాడుకని,యాసని,
స్వచ్ఛమైన భాషని
అక్షర ఆంక్షలకిక పోకండి.

భాషను మీనమేషాలకు
శ్లేషలకు, పరిమితి చేసి
తేట తెలుగునుకూడా
సంస్కృతంలా, సంధ్యవార్చి
అత్యుత్సహంతో అటకెక్కించకండి.

అందరి మదిగదిలో
నదిలా, సెలయేరులా
భాషను, భావాన్ని
ప్రజావాహినిలో, సాహితీ ప్రపంచాన
ఆలోచనతో, అవగాహనను పెంచి

పరస్పరం తమ, పర
సత్కారాల, పురస్కారాలకే గాక
తెలుగు భాషోద్యమం, అనే
యజ్ఞంలో భాగస్వాములవుతూ
ఏ దిక్కునున్నా దిక్సూచులై నిలిచి
తెలుగు భాష ఋణానుబంధాన్ని
కాస్తైనా తీర్చుకొనే అవకాశాన్ని
అందుకొని, ఆదర్శంగా నిలుద్దాం.

29, జులై 2018, ఆదివారం

N “light” (Treat) menT

—————////———-
14 సంవత్సరాలక్రితం
ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ కొనేప్పుడు
డాలర్ పడిపోతే బావుండనుకొన్నా

14 సంవత్సరాల తరువాత
ఇండియాకి వెళ్ళాలనుకొంటూ
రూపాయి పడిపోవాలనుకొంటున్నా  ...
విచిత్రం ! కాదు కాదు, స్వార్థం!

అసలు విషయమేంటంటే ?
ఈ మధ్యలో, వయసు పైబడి
తెల్లెంట్రుకలు ఎక్కువై,
కంటద్దాల పవర్ పెరిగి
ఎముకల పటుత్వం తగ్గి,
నరాల్లో సత్తువ నశించి

అన్నీ తినలేక, తిన్నా అరగక
నిద్ర చిధ్రమై, ఆసలు చావక,
ఏదేదో సాధించాలనీ, ఏమీచేయలే
అరే! ఇది,మిడిల్ ఏజ్ క్రైసిస్. ఇపుడెలా..?
అని, అతి త్వరగ గుర్తించి...

తిక్క సన్నాసిని, వేదాంతం వైద్యమనుకొని
మిడి మిడి జ్ఞానంతో , మెదడుకు మైనం పూసుకొని
గీత ముందేసుకొని, నా గజిబిజి మనసును
ఒక గీతలో పెట్టమని, దేవుడ్నడిగితే ఎలా?

సరిగ్గా అప్పుడే ... అదిగో!
నా అంతరాత్మ( ఆకాశవాణి) చెప్పింది… ఇలా !

“నీలో మనిషిని గుర్తించి
మానవత్వంతో మెసలి
జ్ఞానమనే దివ్వెను వెలిగిస్తే
మెదడున మైనంకరిగి
కొవ్వొత్తిలా.. దారి చూపి
కొందరికైనా సహాయపడి
నీ జన్మను  సార్ధకం చేసుకో … వృద్ధాప్యంలో...!”

If you know how to lighten desires and tight situations, early in your  life....  you are “enlightened”..!

27, జులై 2018, శుక్రవారం

ఏ పాటి?

ఎవరు ఏ పాటి?
తెలిసిందేపాటి? ఎరుకైందేపాటి?
ఎవరికి ఎవరు సాటి?
ఎవరెవరి మధ్య ఈ పోటీ?

ఒకడేమో సహపాటి
మరొకడు ఘనాపాటి
ఇప్పుడింకొకడు తయారు!

వ్యాపారంలో లాభం రాక
ఉద్యోగంలో రాదనా రూక
మనుషుల్లో బలహీనత
ఎంచక్కా  గమనించాక
పట్టాడీ ప్రవచనాల బాకా..!

వినేవాడికి చెప్పేవాడు లోకువన్నట్టు
ఇతగాడు చెప్పే నీతులు
తీసే కులాల లోతులు
ఆతని సమాజ రీతులు
ప్రజాస్వామ్యానికి గోతులు
రాజ్యాంగ వ్యతిరేక కారకాలు
ఇతడు ఛాందస భావాల
ముసుగులో కుహనా పాటి
డబ్బుకు గడ్డితినడమే పరిపాటి.

సంభావనలేకుండా ఒక్క ప్రవచనం
చెబుతారేమో చూడండి?
కులం హలంనుండి పెల్లుబికిన
సనాతన మురికే ఈ గడ్డిపాటి
తస్మాత్ ! జాగ్రత్త !!

 ఎవరిది ఏ స్థాయి?
నిర్ణయించడానికి, వీరికెక్కడిదా స్థాయి?
ఎవరిక్కడ, ఎప్పటికీ చిరస్ధాయి?
మనుషుల్లో హెచ్చు తగ్గులు
పుట్టుకతో ఎలా వస్తాయి ?
కొందరికే, అవెలా తెలుస్తాయి?


నాటికి, నేటికీ
తమ స్వార్థంకై
మాట మాటకీ
శ్లేషను, విశ్లేషణను
పురాణఇతిహాసాలను
ఇప్పుడు, కొత్తగా ప్రవచనాలని
నీతని, నేతిమాటల చెప్పి
పట్టు పీతాంబరాలతో
ఒకింత సాంకేతికత
జోడించి, జూ లక టక
మాటల మూటలను
గంటల పంచాంగాలతో
వాస్తు అవాస్తవాలతో
తిమ్మిని బిమ్మిని చేసే
మాటల గారడీలతో
హిందుత్వ అజెండాల
మతతత్వ అధికార అండతో

అమ్మని, సరస్వతమ్మనీ
అమ్ముకొని, పబ్బంగడుపుకొనే
వ్యాపారం ఊపందుకొంది.
మానవుల, మనువు బానిసల
చేసే పర్వం ఆరంభమైంది
ఈ ఇరవయ్యొకటో శకంలో

మేలుకో, ఓ యువతా మేలుకో!!
ఈ జగతి జాగృతికై
విచక్షణతో వీక్షించి, ప్రశ్నించి
సమాధానపడి, సంయవనంతో
ప్రపంచాన్ని గమనించి నడుచుకో!
నీ జీవన గమనం మెరుగుపరుచుకో!!
మానవత్వంతో ప్రపంచాన్ని గెలుచుకో !!!